దటీజ్ శ్రీరెడ్డి..! ఆమెను వాడుకుని రేటింగ్సు పొందాలనుకున్న చానెళ్లకు, ఆమె లేవనెత్తిన పాయింట్లకు మద్దతుగా నిలిచినవాళ్లను కూడా ఆమె బజారు కీడ్చగలదు… తన లీక్స్, మహాన్యూస్ పుణ్యమాని దక్కిన పాపులారిటీని వాడుకుని… ఇన్నాళ్లూ తన అవకాశాలు, తన మా సభ్యత్వం అనే వ్యక్తిగత డిమాండ్ల స్థాయి నుంచి మహిళోద్ధారకురాలిగా భావిస్తున్న ఆమెకు ఇప్పుడు ఆమె పేరులో రెడ్డి ట్యాగు భారంగా తోస్తున్నది… ఆమె అసలు కులమేంటీ అనేది ఇక్కడ అప్రస్తుతం… అకస్మాత్తుగా ఆమె తన పేరును శ్రీరెడ్డి నుంచి శ్రీశక్తిగా మార్చుకుంది… ఎందుకమ్మా అంటే..? ఆ తోక ఉండటం వల్ల అందరినీ కలుపుకొని పోవడం కష్టంగా ఉందట… మరి ఇన్నాళ్లూ దాంతో ఏ ప్రాబ్లమూ రాలేదెందుకో..!? ఎవ్వడైనా సరే, ఎదిరించి బజారుకీడుస్తా, ఏమనుకుంటున్నారో అన్నంత ధీమా వచ్చింది ఆమెకు ది గ్రేట్ మహా న్యూస్ పుణ్యమాని..! ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె వీడియోలు చూస్తేనే ఆమె ఏమిటో తెలుస్తుంది… అలాగని స్త్రీజనోదర్ధణ పోరాటాలకు ఆమె అనర్హురాలు కాదనలేం… కానీ ఆమె పరిణతి ఎంత..? కేవలం వ్యక్తిగత నష్టం కోణంలోనే ఆలోచించే ఆమెకు స్థూలంగా ‘మహిళల లైంగిక దోపిడీ’పై ఉన్న అవగాహన ఎంత..? ఆమె అధ్యయనం ఏమిటి..? లింగ వివక్ష, స్త్రీ సమానత్వం వంటి పెద్ద పెద్ద పదాలపై ఆమె విశ్లేషణ, చర్చ స్థాయి ఏమిటి..? ఈ సోషల్ లీకులు, ఓ అర్ధనగ్న నిరసన… ఓ చానెల్ మద్దతు ఇదేనా..? ఇదీ ప్రశ్న..!
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌పై ఫస్ట్ స్పందించిన పెద్ద హీరో పవన్ కల్యాణ్ ఒక్కడే… చట్టాల ద్వారానే న్యాయం జరుగుతుంది… మీడియా చానెళ్ల ద్వారా కాదమ్మా అని చెప్పాడు… తన అభిప్రాయమేంటో తను చెప్పాడు… నువ్వు ఎంచుకున్న దారి సరైందీ కాదని హితవు చెప్పాడు… వెంటనే ఆమె స్పందించి ఎడాపెడా ట్వీట్లు మొదలు పెట్టింది… పవన్ వ్యాఖ్యల్నీ తప్పుపట్టింది… నన్ను తక్కువ చేసి మాట్లాడారు, మీరు నాకు అర్థం కావడం లేదు అంటూ ఎదురుదాడికి దిగింది… (పవన్ కల్యాణ్‌ను అర్థం చేసుకోవడం మహామహులకే సాధ్యం కాలేదు… కాదు… నువ్వెంత తల్లీ..?) పబ్లిసిటీ కోసం ఇదంతా చేయడం లేదని వివరణ ఇచ్చింది… పవన్ కల్యాణ్ తను ఆ విమర్శ చేయలేదుగా…? పైగా మొన్నమొన్నటిదాకా లేని స్త్రీ జనోదర్ధణ కాంక్ష మా సభ్యత్వ నిరాకరణతోనే ఎందుకొచ్చింది..? ఇన్నేళ్లు ఫీల్డులో ఉంటూ కలగని ఏవగింపు అకస్మాత్తుగా మహాన్యూస్ అనే ఓ బోధి వృక్షం కిందే ఎందుకు కలిగింది..? ఒక్కసారి ఈ చానెళ్లు వదిలేసి, ఈ లీకుల్ని జనం పట్టించుకోవడం మానేస్తే అప్పుడేమిటట..?
పోలీసులే న్యాయం చేసే పక్షంలో ప్రత్యేక హోదా కోసం, ఆంధ్రా కోసం పోరాాటాలు ఎందుకు..? పోలీస్ స్టేషన్ వెళ్లండి అని పవన్ కల్యాణ్‌కే హితవు చెబుతున్నది… ఆక్షేపిస్తున్నది… ఆ రాజకీయాల సంక్లిష్టత తనకేదో అర్థమైనట్టు..? ఒక హీరో ఈ సున్నితమైన సమస్యపై స్పందించినప్పుడు స్వాగతించాలి… ఆ స్పందన తను అనుకున్నట్టే రావాలి, లేకపోతే తిట్టేస్తా అనే ధోరణి ఏమిటసలు..? ‘అసలు పవన్ కల్యాణ్ సపోర్ట్ ఎవరడిగారు..?’ అనేదాకా పోయింది ఆమె స్థాయి ఇప్పుడు..? పైగా సినిమా ఇండస్ట్రీని చూస్తే సిగ్గేస్తున్నదట..! మొన్నమొన్నటిదాకా ఇదే ఇండస్ట్రీలో అవకాశాల కోసం నువ్వు పడిన పాట్లు, వేసిన వేషాలు మరిచి, ఇప్పుడు అకస్మాత్తుగా ఓ స్త్రీజనోద్ధకురాలు అయిపోతే ఎలాగమ్మా..? ఏయ్, ఈ విషయంలో మా నాన్న ఉన్నా వదిలేది లేదు, నాకు సెంటిమెంట్లు లేవు, నా ఫ్రెండ్, నా ఫేవరెట్ హీరో ఎవరున్నా సరే విడిచిపెట్టేదే లేదు అంటున్నదిప్పుడు ఆమె….
ఇదే శ్రీరెడ్డే కదా… సారీ, శ్రీశక్తి లేదా స్త్రీశక్తి… ఏదో ఒక పేరులెండి… పవన్ కల్యాణ్ వంటి స్టార్లు స్పందిస్తేనే న్యాయం జరుగుతుంది అని ట్వీటింది… మరి తను స్పందించినప్పుడు ఈ దాడి ఏమిటి..? తన అభిప్రాయం తను చెప్పాడు… అందులో తప్పేముంది..? ఎవరో ఒకావిడ మహేష్ కత్తిపై ఏవో ఆరోపణలు చేసింది… తను కూడా నన్ను వాడుకునే ప్రయత్నం చేశాడు అని ఆరోపించింది… ఆ ఎదురుదాడి వెనుకా ఓ నేపథ్యం, ఓ కథ, ఓ ఎత్తుగడ ఉన్నాయని మహేష్ ఆరోపణ… సరే, అది వేరే కథ… మొన్నమొన్నటిదాకా టీవీ డిబేట్లలో ఇదే శ్రీరెడ్డి చేసే వాదనలకు, పోరాటానికి మద్దతుగా నిలిచాడు కదా… ‘ఏయ్, మహేష్ కత్తీ, సిగ్గుండాలి, డిబేట్లలో నీతులు చెప్పడం కాదు, నువ్వు చేసిన పనికిమాలిన పనికి నువ్వే రివ్యూ రాసుకోపో’ అని ట్వీటింది… ఇక్కడ మహేష్ కత్తి అయినా, పవన్ కల్యాణ్ అయినా శ్రీరెడ్డి అనే కత్తికి వివక్ష లేదు… మహాన్యూస్, టీవీ9 రేటింగుల కక్కుర్తి, పోరాటం పుణ్యమాని ఆమె ఆకాశంలో నడుస్తున్నది… ‘నేను ఏదైనా చేసేయగలను’ అనే భ్రమల్లోకి వెళ్లిపోయింది… దటీజ్ శ్రీరెడ్డి ఇప్పుడు..! ఇదే టీవీ9 రవిప్రకాష్, ఇదే మహాన్యూస్ మూర్తిని కూడా అవసరమైతే రేప్పొద్దున ఆమె రివర్స్ దాడిలో ఇరికించి, ఇబ్బంది పెట్టగలదు…… అరెరే… ఓ మంచి కాజ్ కోసం పోరాడుతున్నది ఆమె, మనమూ సపోర్ట్ చేయాలి కదా, ఇదేమిటిలా తప్పుపట్టడం అంటారా..? ఎస్… కానీ అది సోషల్ లీకులు, చానెళ్ల డిబేట్లు, వ్యక్తిగత దాడుల్లో ఓ మంచి సబ్జెక్టు బలి కాకూడదు… భ్రష్టుపట్టకూడదు… ఒక్కసారి కేరళలో జరుగుతున్న మహిళా ఆర్టిస్టులు, 24 క్రాఫ్ట్స్ నిపుణుల సంఘటిత ఆందోళన గురించి తెలుసుకోవాలి… వ్యక్తిగత కేసులు, పోలీసు కేసుల కోణంలోకాదు… ప్రభుత్వం తరఫునే రక్షణ, వేతనాలు, వివక్ష, కనీస సౌకర్యాలు వంటి అనేకాంశాల్లో పకడ్బందీగా ఓ ‘అధికారిక రక్షణ ఛత్రం’ మార్గదర్శకాల కోసం పోరాడుతున్నారు… అదీ స్పిరిట్…